తెలుగు రాష్ట్రాల్లో కడప జిల్లాలోని పెద్దముడియంది చారిత్రకంగా ప్రత్యేక స్థానం.
చాళుక్య సామ్రాజ్యన్ని స్థాపించిన విష్ణువర్ధనుడు ఈ ఊర్లో పుట్టాడని చరిత్రకారులు నిర్ధారించారు.
తొలి నాటి చాళుక్యుల ఆలయం ఉన్న ప్రదేశం గా గుర్తింపు.
అన్నమయ్య దర్శించి, కీర్తించిన నరసింహస్వామి ఆలయం ఈ ఊర్లో ఉంది.
అద్భుతమైన శిల్పాలు ఇక్కడి దేవాలయాలకి అదనపు ఆకర్షణ
--------------
చరిత్రలో కాస్త వెనక్కి
--------------
త్రిలోచనపురం, బ్రాహ్మలముడియం, ముడివేము అగ్రహారం అని పూర్వ నామాలు ఉన్న ఊరు పెద్దముడియం. ఇక్కడ పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాలలో శాతవాహన కాలం నాటి నాణేలు లభించాయి. తర్వాత కంచి రాజధానిగా పాలించిన పల్లవుల సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. క్రీశ 4-5 శతాబ్దాల కాలం నాటి పల్లవ రాజు త్రిలోచన పల్లవుడు ( ఈయనకి ముక్కంటి కాడువెట్టి అని ఇంకో పేరు, అడవులు నరికించి అగ్రహారాలు ఏర్పాటు చేసారని ఈ పేరు వచ్చింది. ) నిర్మించిన ముక్కంటీశ్వర ఆలయం ఇక్కడ ఉంది.
ఈ త్రిలోచన పల్లవుడికి, ఉత్తరదేశం నుండి వచ్చిన విజయాదిత్యుడికి పెద్దముడియం దగ్గర జరిగిన యుద్ధంలో విజయాదిత్యుడు చనిపోతాడు. ఈ యుద్ధం జరిగే సమయానికి విజయాదిత్యుని మహారాణి 6 నెలల గర్భవతి. భర్త చనిపోయిన ఈ మహారాణిని పెద్దముడియంలో ఉన్న విష్ణుభట్ట సోమయాజి అనే బ్రాహ్మణుడు చేరదీసి తన సొంత కూతురు లాగా చూసుకుంటూ ఉంటాడు. కొన్నాళ్ళకి, మహారాణి ఒక మగబిడ్డకి జన్మనిస్తుంది. తనని చేరదీసిన విష్ణుభట్టుడికి కృతఙ్ణతతో తన కుమారుడికి విష్ణువర్ధనుడు అని పేరు పెడుతుంది మహారాణి. ఈ విష్ణువర్ధనుడు తర్వాత కాలంలో చాళుక్య సామ్రాజ్యన్ని స్థాపించాడు.
-------------
పర్యాటక ఆకర్షణలు
-------------
పెద్దముడియం లో ఉన్న చారిత్రక ప్రదేశాలు, ముక్కంటీశ్వర ఆలయం, కాశీ విశ్వనాథాలయం, నరసింహస్వామి ఆలయం, ఈ మూడు ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉంటాయి. వీటికి దగ్గర్లో ఇంకో నరసింహస్వామి ఆలయం, మోడెమ్మ ఆలయం, ఊర్లో కోదండ రామాయలం, ఆంజనేయస్వామి గుడి, శివాలయం ఉన్నాయి. అలానే పాలెగాళ్ళ కాలంలో నిర్మించిన రెండు పెద్ద బురుజులు కోదండరామస్వామి గుడి దగ్గర్లో మనం చూడొచ్చు.
వీటి అన్నింటిలో ముక్కంటీశ్వర ఆలయం అతి పురాతనమైనది. చాళుక్యుల శిల్పకళా ప్రయోగాలకి ఈ ఆలయం ఒక నిదర్శనం. చాళుక్యుల తొలినాటి ఆలయం అని చరిత్రకారులు అనే గుడి ఇదే. శిల్పాలకి వాడిన రాయిని, సముద్రంలో అలలు ఉన్నట్లుగా హెచ్చు తగ్గులుగా చేసి, వాటి మీద శిల్పాలు చెక్కడం అద్భుతం. ముక్కంటీశ్వర ఆలయం శివాలయం, కానీ గుడి గోడల మీద, విష్ణు శిల్పాలు, దుర్గ, విఘ్నేశ్వర, వీరభద్ర శిల్పాలు, అమృత భాండం కోసం గరుడాంజనేయులుకి జరిగే యుద్ధం లాంటి వైష్ణవ మత శిల్పాలు లాంటివి చూస్తే, ఆ కాలం రాజులు, మత సంప్రదాయాలు అన్నింటినీ సమానంగా చూసేవారు అని తెలుస్తుంది.
ముక్కంటీశ్వర ఆలయానికి ఎడమ వైపు ఉన్న చిన్న గుడి కాశీవిశ్వనాథ స్వామి గుడి. కుడి వైపు, నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ నరసింహాలయంలో ద్వారభంధం దగ్గర స్థంభాలు పల్లవ శైలి లో ఉంటాయి. మంటపంలోని స్థంభాలకి వైష్ణవ మత శిల్పాలు ఉన్నాయి. గుడి ఆవరణలో నవగ్రహ మంటపం, వీరభద్రాలయం, గరుదాలయం ఉన్నాయి. పెద్దముడియం చరిత్ర చెప్పే శాసనం, గుడి వెనుక ఉంది.
-------------------------
పెద్దముడియం అష్తదిక్పాలక శిల్పాలు
-------------------------
ముక్కంటీశ్వర ఆలయ శిల్పాలలో ఇంకో అదనపు ఆకర్షణ అష్టదిక్పాలక శిల్పాలు. గుడి 8 మూలలకి, ఈ అష్టదిక్పాలక శిల్పాలు ఉన్నాయి. ఈ దిక్పాలకులని, వారి వాహనాలతో సహా చెక్కడం ఇక్కడ ప్రత్యేకత. వాయు దేవుడికి జింక వాహనం, కుబేరుడికి నరవాహనం, ఇంద్రుడికి ఐరావతం, మేక వాహనం మీద అగ్ని దేవుడు, నైరుతికి గుర్రం, మొసలి మీద వరుణ దేవుడు, యముడు దున్నపోతు వాహనం మీద, ఎద్దు మీద ఈశానుడు లాంటి శిల్పాలని అద్భుతంగా చెక్కారు.
చాళుక్యులకి ఆ కాలంలో వేరే దేశాలతో వ్యాపార సంబంధాలు ఉండేవి, కాబటి అక్కడి దేవుళ్ళు, ఆకారాలు ఇక్కడి శిల్పాలలో మనం గమనించవచ్చు. ఉదాహరణకి, పర్షియా లో ని లామస్సు, ఇండోనేషియా శిల్పాలలోని కిరీటాలు ఇక్కడ శిల్పాలలో మనం చూడొచ్చు.
పంచతంత్రం లో మొసలి-కోతి కథ కూడా శిల్పం లాగ ఇక్కడ ఉంది.
--------------------
అన్నమయ్య దర్శించిన ఆలయాలు
--------------------
ఈ ముక్కంటీశ్వరాలయం వెనుక ఉన్న రోడ్ లో ఎడమవైపు కొద్ది దూరం వెళ్తే, వచ్చే నరసింహస్వామి ఆలయాన్ని అన్నమయ్య దర్శించి, ఈ స్వామిపై శృంగార కీర్తన రచించారు.
"జయ మాయ నీకు నాపె సరసముల నయగారి ముడియము నారసింహా" అని అన్నమయ్య ఈ స్వామిని నయగారి నరసింహుడు అని కీర్తించారు.
ఇక్కడ నరసింహస్వామి, నిలుచున్న భంగిమలో, ఎనిమిది చేతులతో ఉంటారు. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ గుడిలో కూడా అద్భుతమైన శిల్పకళ ఉంది.
పెద్దముడియం కి 10కిమీ దూరంలో ఉన్న మేడిదిన్నె గ్రామంలో ఆంజనేయస్వామి గుడి ఉంది. అన్నమాచార్యుల వారు ఈ స్వామిని కూడ దర్శించి, ఆంజనేయుని వర్ణిస్తూ కీర్తన రచించారు.
"చెల్లె నీ చేతలు నీకే చేరి మేదిగుడిదిన్న
నల్లదే కంటిమి నిన్ను హనుమంతరాయ" అని రామాజ్ణతో సముద్రంపైకి లంఘించడానికి సిద్దంగా ఉన్న ఆంజనేయా అని అన్నమయ్య వర్ణించారు.
--------------------
పర్యవేక్షణ
-------------
ప్రస్తుతం పెద్దముడియం ఆలయాలన్ని కేంద్ర పురాతత్వ సంరక్షణలో ఉన్నాయి. ఇక్కడి చరిత్ర కాని, అద్భుతమైన శిల్పాల గురించి చెప్పడానికి ఒక్క గైడ్ కూడ ఉండకపోవడం మన దురదృష్టం. ప్రభుత్వం కూడా పర్యాటకం అభివృద్ధి కి చర్యలు తీసుకోకపోవడం మనం దౌర్భాగ్యం.
------------
ఎలా చేరుకునేది.
------------
పెద్దముడియం, కడప జిల్లాలో జమ్మలమడుగు నుండి 20కిమీ దూరంలో ఉంటుంది. ప్రముఖ పర్యటక ప్రాంతం అయిన గండికోట దగ్గర్లో ఉన్న ఈ ఆలయాలు, సరైన చర్యలు తీసుకుంటె చేస్తే పర్యటకం అభివృద్ది చెందుతుంది.