Thursday, June 2, 2016

చకోరి పాట, సాహసం శ్వాసగా సాగిపో సినిమా నుండి !!!

చకోరి పాట, ఆ పాట వరుస ఏమిటో ఒక్క సారి విన్న వెంటనే మళ్ళీ వినాలనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఇంతగా వినాలన్న పాట రాలేదేమో లేక ఆ ట్యూన్ ప్రభావమో.  మాములుగా రహమాన్ గారి పాటలు నిదానంగా అలవాటు అవుతాయి. ఈ పాట విన్నప్పడి నుండి వినాలనిపిస్తోంది . పాటలో పదాలు కూడా అలానే అమరాయి అనంత శ్రీరాం గారి దయ వలన. మధ్యలో కర్నాటక సంగీతం లో వచ్చే చిన్న వయోలిన్ బిట్ కూడా, చాలా బాగుంది అన్నీ కలిపి. 

ఈ పాట లిరిక్స్: అనంత శ్రీరాం గారు 
సంగీతం : రహమాన్ గారు, సినిమా: సాహసం శ్వాసగా సాగిపో 

పదవే నీ రెక్కలు, నా రెక్కలు చాచి. 
పోదాం ఈ దిక్కులు, ఆ చుక్కలు దాటి. 
పరువంలో  రాదారి ఆకాశం అయిందే . 
పైపైకెళ్ళాలన్నదే, చకోరీ !!!!

పదరా ఆ చోటికి, ఈ చోటికంటానా 
నీతో ఏ చోటికైనా వెంటనే రానా .. 

చకోరీ ..... పందెములో .... పందెములో.. 
నే ముందరో , నువ్ ముందరో చూద్దాం ... చూద్దాం ... 

మొదట ఆ మాటని మాటాడగలదెవరో
మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో 
తొలిగా మౌనాలని మోగించగలదెవరో 
ముందు చెప్పెదెవరో , ముందుండేదెవరో 
ఎదురుగ నిలిచి, ఎదలను తెరిచే 
కాలం ఎప్పుడో , ఆ క్షణం ఇంకెప్పుడో ... 

ఇట్టే పసిగట్టి , కను కదలిక బట్టీ కనిపెట్టి,
వలపుల రుచి పట్టే పనిముట్టే అవసరమట ఇకపైనా 
ఇన్నాళ్ళుగ  దాగున్నది విరహం , 
ఎన్నాళ్లని మొయ్యాలట హృదయం,
అందాకీ పయనం సులువుగ మరి ముగిసేనా .... 

తోడై నువు తీయించిన పరుగులు, 
నీడై నువు అందించిన వెలుగులు ,
త్రోవై నువు చూపించే మలుపులు, మరిచేనా ..... 

బాగున్నది నీతో ఈ అనుభవం,
ఇంకా ఇది వందేళ్ళు అవసరం ,
నేనందుకు ఏం చేయలన్నది, మరి తెలిసేనా... 

చకోరీ ..... పందెములో .... పందెములో.. 
!!!!!! :)


Sunday, July 26, 2015

నందికంది, ఝరాసంగం, గొట్టంగుట్ట యాత్ర

నిన్న సంవత్సరం కార్తీక మాసం చివరి రోజు శనివారం పడ్డప్పుడు వెళ్ళినప్పటి యాత్రా విశేషాలివి. ఇన్నాళ్ళు సమయం దొరక్క రాయలేకపొయాను. ఇన్నాళ్ళకి తీరిక దొరికింది. తెలుగు లో ఈ విధంగా కథ లాగా రాస్తూ ఉంటే సమయం బాగా అయిపోతుంది. అందుకే ఇన్ని రోజులు ప్రయత్నాలు విరమించుకుంటూ వస్తూ ఇప్పుడు రాద్దాం అని కూర్చున్నాను .

రాజు, గిరి, నవీన్, నేను అప్పుడు మా గది లో ఉన్నవాళ్ళం. రాజు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు . నవీన్ దుబాయ్ కి వెళ్లి అక్కడ వాతావరణం సరిపోక తిరిగి మనదేశానికి వచ్చాడు. గిరి, నేను ఇక ఈ గది లోనే గత 4 సంవత్సరాలుగా ఉంటున్నాము. చిన్నోడు ఇచ్చిన splendor బండి ఉంది, రామిరెడ్డి ని అడిగి shine బండి తీసుకున్నాం. చాలా రోజులు అయింది కదా, ఒక దూర ప్రయాణం చేద్దాం అని అనుకుని, గొట్టం గుట్ట అనే ప్రదేశం ఖాయం చేసాం . మేము ఉన్న లింగంపల్లి కి 80kms దూరం లో ప్రకృతి రమనీయ ప్రదేశం లో ఉన్న ప్రాంతం అది. సరళా నది పై చంద్రంపల్లి జలాశయం నిర్మించడంతో ఏర్పడిన వెనుక జలాలు "S" ఆకారంలో తిరిగి ఉంటూ, ఆ కొండలు, ప్రకృతి చూడాల్సిందే అని నిశ్చయించుకున్నాం. ఫొటోస్ లో చూడడానికి కింద విధంగా ఉంటుంది.

ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈ నలుగురిలో నాకు తప్ప మిగిలిన వాళ్ళకి ఎలా వెళ్ళాలో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నామో మాత్రం తెలుసు. వెళ్ళాల్సిన దారి మొత్తం gogle maps గుర్తు పెట్టుకుంది నేను ఒక్కడినే. కాబట్టి ఎలాగూ జహీరాబాద్ వరకు వెళ్తున్నాం కదా, దారిలో నందికంది శివాలయం, ఝారసంగం గుడి చూసొద్దాం లే అని అనుకున్నాను. ఇవన్నీ  గొట్టం గుట్ట కి వెళ్ళేదారిలో ఒక 5-10 kms దూరం రోడ్ కి అటు ఇటు ఉంటాయి.

పొద్దున్న 4 కి నిద్ర లేద్దాం అనుకున్నాం, నేను 4 కి లేచా, కాని అందరు లేచి సిద్దం అయేసరికి 7 అయింది. 5 కి ఎలాగైనా ప్రయాణం మొదలవ్వాలి అనుకుంటే ఇక్కడే 7 అయింది. సరేలే కొంచెం వేగంగా వెళ్ళొచ్చు అనుకుని మొదలుపెట్టాం. మా బండ్ల గురించి చెప్పా కదా, ఒకటి Splendor, ఇంకోటి Shine. కాబట్టి బండి ఇంజిన్ చల్లబడడానికి ప్రతి 20kms లేదా 40 నిమిషాలకి ఒక సారి ఆగుదాం అనుకున్నాం. మొదట కంది ఊర్లో ఆగాం, 7:50 అయింది. అక్కడ రోడ్ పక్క టీ అంగడి లో టీ తాగి, పేపర్ చదివి, ఒక్కొక్కడికి పొద్దున్నే చలికి కడుపు పట్టుకుంటే అలా రోడ్ పక్కకెళ్ళి కడుపు ఖాళీ  చేసి బయలుదేరాం. తర్వాత నందికంది, వీళ్ళకి తెలీదు కదా ఇది నా plan  లో ఉందని. అందుకే టీ తాగేటపుడు ఆరోజు వెళ్ళవలసిన ప్రదేశాలు, వాటికి దారి అన్నీ విశదీకరించి చెప్పాను. ఈ నందికంది, కంది కి 10kms దూరం. 11వ శతాబ్దం లో, కళ్యాణి చాళుక్యులు నిర్మించిన ఒక శివాలయం. నక్షత్రాకారపు పునాది మీద, పూర్తిగా రాతి నిర్మాణం. స్తంభాల మీద అద్భుత శిల్పాలు, గుడి బయట వీరగల్లులు చాలా ఉన్నాయి. గుడి పై ఫోటో లో లాగ ఉంటుంది. ఇక్కడ నంది ప్రత్యేక ఆకర్షణ.

ద్వార తోరణం కి 6 రంధ్రాలు ఉంటాయి. ఊరి వాళ్ళని అడిగితే, ప్రతి రుతువుకు ఒక్కో రంద్రం గుండా సూర్య కాంతి శివాలయం మీద పడుతుంది అని చెప్పారు, ఎందుకో నమ్మాలనిపించలేదు. సూర్యకాంతి రంధ్రంలో నుండి పడ్డా కానీ, బయట గుడి వెలుతురు వలన ఎలా తెలుస్తుంది. బాబు ఇవన్నీ ఆలోచిస్తే మనకి సమయం వృధా అవుతుందని అక్కడినుండి బయలుదేరాము. సదాశివపేట టౌన్ లో ఆగాము 9 కి, కారం దోశ, ఇడ్లి తిని, మళ్లీ ప్రయాణం మొదలుపెట్టాం, ఈసారి ఝారాసంగం. సదాశివపేట లో ఇడ్లి బండి అతను, అక్కడికి దగ్గరే, జహీరాబాద్ వెళ్ళాసిన అవసరం లేకుండా, ఏదో ఊరి పేరు చెప్పి, అక్కడినుండి వెళ్ళమని చెప్పాడు.

దారి మొత్తం, శీతాకాలపు ఎండిపోయిన గడ్డి పొద్దున్న సూర్యకిరణాలకి బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటే, ఆగుతూ ఫోటోలు తీసుకుంటూ చాలా  సరదాగా సాగింది యాత్రలో ఈ భాగం. పల్లెటూరి రహదారులు, దారికి అటు ఇటు పొలాలు, పూల తోటలు అద్భుతం. ఇన్నాళ్ళ నగర వాతావరణానికి అలవాటు అయిన మాకు కాస్త విశ్రాంతి ఈ  పల్లె వాతావరణం కలిగించింది ఎండ కూడా పొద్దున్న 10 కి అంతగా అనిపించలేదు. ఇప్పుడే ఇలా ఉంటే, వర్షాకాలం లో ఇంకా బాగుండేది ఏమో .

ఆ విధంగా పల్లెలు, పొలాలు దాటుకుంటూ ఝారాసంగం చేరేసరికి 11:30 అయింది. కార్తీక మాసం చివరి రోజు కదా, జనాలు చాలా మంది ఉన్నారు గుడిలో. దర్శనం కి వెళ్తే ఇంటికి వెళ్ళలేము అనుకుని, గుడి బయటే టెంకాయ కొట్టి ఒక అరగంట కూర్చున్నాం గుడి ఆవరణలో. కొద్దిసేపు ప్రయాణ బడలిక పోయాక బయల్దేరుదాం అనుకున్నాం. ఝారాసంగం లో ఒక చిన్న కోనేరు గుడి వెనుక ఉంటుంది, ఆనుకుని. అందులో ఎప్పుడు నీరు  ప్రవహిస్తూ ఉంటుంది అంట. మేము వెళ్ళినపుడు జనాలు ఆ నీటిని రోత చేసేసారు. మాములు రోజుల్లో చాలా స్వచ్చంగా ఉంటుందని అన్నారు, ఎప్పుడైనా మళ్లీ వెళ్ళాలి.  గుడిలో ప్రసాదం, పులిహోర తీసుకుని దారిలో తిందాం అని అక్కడి నుండి 12:30 కి బయలుదేరాము. దారిలో చెరకు తోట పక్కన, వేప చెట్టు కనపడితే, దాని కింద కూర్చుని, లడ్డు, పులిహోర లాగించి, ఎండా మరీ ఎక్కువగా ఉంటే ఒక 15 mins  అక్కడే కూర్చుని, జహీరాబాద్ కి బయలుదేరాము.

జహీరబాద్ కి 2 కి చేరుకున్నాం. గొట్టం గుట్ట ఇక్కడికి 20kms  దూరం. లడ్డు, పులిహోర లతో ఆకలి తీరక పోయేసరికి, జహీరాబాద్ లో biscuits, పకోడీలు, వాటర్ bottles  తీసుకుని, గొట్టంగుట్ట కి బయలుదేరాము. గొట్టంగుట్ట కి వెళ్ళేదారిలో చాలా తాండాలు ఉన్నాయి, అక్కడికి బస్సులు, రవాణా వంటివి చాలా తక్కువ అనుకుంటాను, దారి  లో ఒక 2 గంటల ప్రయాణం లో ఏదో 10 మంది కంటే ఎక్కువ మంది కనిపించలేదు, పొలం పనులకి వెళ్ళారేమో ఏమో తెలీదు, ఇదే హైదరాబాద్ లో అయితే, రోడ్ మీద మనుషుల కంటే వాహనాలు ఎక్కువ కనపడుతాయి. ఆ విధంగా అక్కడి ప్రజలు ప్రశాంతంగా, కాలుష్యం లేని వాతావరణం లో జీవిస్తున్నారు. ప్రజలు చాలా వరకు నడిచే వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళాలన్న కానీ. వెళ్ళడానికి మట్టి, రాళ్ళ రోడ్ మీద ప్రయాణం . దారికి అటు ఇటు అటవీ శాఖ వారు వేసిన eucalyptus చెట్లు దారికి మరింత అందాన్ని ఇచ్చాయి. ఇక్కడ భూమి, మట్టితో కూడిన రాయి అంటే వికీపీడియా ప్రకారం బిళ్ళరాయి .

ఇక్కడి ప్రజలు ఈ రాతినే ఇటుకల లాగ కత్తిరించి ఇల్లు, ఇతర నిర్మాణాలకి వాడుకుంటున్నారు. ఇలాంటి రాతి నిర్మాణాలు నేను బీదర్ లో కూడా చూసా. భూమి ఈ విధంగా రాతిమయం అయినందున ఇక్కడ అంతగా వ్యవసాయం చేస్తున్నట్లు అనిపించలేదు, ఆ eucalyptus చెట్లు తప్పితే. ఈ తండా పేరు చున్నంబట్టి తండ. ఈ పల్లె దాటుకుని ఒక 4 kms వరకు ఈ eucalyptus plantation ఉంటుంది .

తర్వాత చిన్న అడవి మొదలవుతుంది. ఇది చించోలి అభయారణ్య ప్రాంతం లోకి వస్తుంది. ఈ అడవి దారి మధ్యలో చిన్న చిన్న గుళ్ళు, శివాలయం, విఘ్నేశ్వరాలయము, భవాని గుడి లు ఉంటాయి. వీటి అన్నింటిని దాటుకుని వెళ్తే చివరగా వంపులు తిరుగుతూ జలాశయం లో కలిసే సరళా నది కొండ కింద కనపడుతుంది, ఆ దృశ్యం అద్భుతం.

మేము వెళ్లేసరికి 3:30 అయి ఉండొచ్చు, ఎండ సెగలు కక్కుతోంది, దానికి తోడు ఈ జలాశయం లో నీళ్ళు. కిందకి దిగొచ్చు అంటే, గబ గబా దిగేసాము. కింద ఇంకా అద్భుతం. ఆ అడవి, పచ్చదనము, నది. ఒక్కోటి అద్భుతం. అలా ఇలా తిరుగుతూ, కొద్ది సేపు ఫోటోలు దిగుతూ, ఒక చెట్టు చూసుకుని, దాని కింద కూర్చున్నాం, పకోడీలు ఆరగించడానికి. నిదానంగా తిని, బయల్దేరుదాం అనుకున్నాం. కొన్ని ఫొటోస్ తీసుకుని బయలుదేరాం.

కిందకి దిగేతపుడు ఎంత సులభం అనిపించిందో, ఎక్కేతపుడు మాత్రం సినిమా చూపించింది. ఒక్కొక్కడికి పైకి ఎక్కేసరికి చొక్కాలు తడిసిపోయాయి. ఎక్కిన తర్వాత, అక్కడ బక్క మహాప్రభు గుడి ఉంటే, కాసేపు కుర్చుని, సేద తీర్చుకుని బయలుదేరాము. అక్కడ గుడిలో ఉన్న వాళ్ళని ఇంకేమైనా చూడటానికి ఉన్నాయా అని అడిగితే, ఎత్తిపోతల జలపాతం దగ్గరలో ఉందని అన్నారు. ఎత్తిపోతల అంటే నాగార్జునసాగర్ దగ్గర కూడా ఉండేది అంటే, ఏమో తెలీదు, మేము దీన్ని ఎత్తిపోతల అనే పిలుస్తాము అన్నారు. జలపాతం లో నీరు ఉందా అంటే, ఉంది అన్నారు. తర్వాతి ప్రదేశం, ఎత్తిపోతల జలపాతం చూసొద్దాం అని బయల్దేరాం.

దారి పొడవునా రోడ్ కి అటు ఇటు ఎండిపోయిన గడ్డి, పూల తోటలు, ఈ దారి పొద్దున్న చూసిన దారి కంటే ఇంకా బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అదృష్టవంతులు, లేకుంటే ఇన్ని అందాలు రోజు చూస్తె భాగ్యం వాళ్ళకి ఉంది. ఈ దారిలో కొన్ని ఫొటోస్ తీసుకుని, బయలుదేరాం. రవాణా కష్టం కాబట్టి, రోడ్ ల మీద కనుచూపుమేరలో ఒక మనిషి కూడా కనపడడం లేదు. అంతా గాలి కి గడ్డి చేసే సౌండ్ మాత్రమే, నిశ్శబ్దం అసలు. రణగొణ ధ్వనుల నుండి ఉపశమనం.

ఆ విధంగా ఆ పల్లెలు, చిన్న చిన్న కొండలు దాటుకుంటూ వెళ్ళాము. మధ్యలో ఒక ఊరి దగ్గరకి వచ్చేసరికి గమనిస్తే, మేము కర్నాటక రాష్ట్రంలో ఉన్నాము. అలా ఊర్ల నుండి వెళ్తూ, దూరం లో కొండలు నీలిరంగులో, రోడ్ కి అటు ఇటు పొలాలు, ప్రకృతి చూస్తూ, అలా వెళ్ళాక, కొద్దిసేపటికి జలపాతం దగ్గరికి చేరుకున్నాం. జలపాతం చాల చిన్నది, మహా అయితే 25 అడుగుల ఎత్తు ఉంటుంది. మేము వెళ్లేసరికి హొతి గ్రామ స్కూల్ పిల్లలు పిక్నిక్ కి వచ్చి ఆడుకుంటూ ఉన్నారు. మేము కూడా జలపాతం దగ్గర కాసేపు కొండలు ఎక్కి, దిగి, ఫొటోస్ తీసుకుని సరదాగా గడిపి బయలుదేరాం. అప్పటికే 5:30 అయింది. చీకటి పడే సమయం అవుతోంది, కాబట్టి బయలుదేరాం. జహీరాబాద్ కి 6:30 కి చేరుకున్నాం. పెట్రోల్ పట్టించుకుని, రాత్రి ఇంటికి వచేసరికి 10 అయింది, బయటే తిని, వచ్చి పడుకున్నాం. మొత్తానికి ఒక విజయవంతమైన యాత్ర, సరదాగా, అంతకి ముందు జనాలకి అంతగా తెలియని అధ్బుత ప్రకృతి రమణీయ ప్రదేశాలు చూసి వచ్చాం.  మరిన్ని ఫొటోస్ కింద picasa slideshow చూడొచ్చు

Saturday, December 21, 2013

దానవులపాడు, జైన క్షేత్రము

ఈసారి దసరా పండక్కి ఇంటికి పోయినపుడు ఇంటర్మీడియట్ ఫ్రెండ్ ప్రసాద్ ఫోన్ చేసి "అరే దానవులపాడు పోదామా, బుద్దుని గుడి ఏదో ఉంది అంట, శాన  పాతది అంట కదా" అని అదిగాడు. చిన్నప్పుడు బళ్ళో చదివేటపుడు దానవులపాడు పక్క ఊరు దేవగుడి నుండి గంగాకుమార్ అనే ఫ్రెండ్ ఉండేవాడు. వాడు ఏదో ఒక సందర్భంలో ఈ గుడి ని చెప్పినట్లు గుర్తు . "సుమారు నూరేళ్ళ కిందట వాళ్ళ ఊరోడు ఒకడు చెంబు పట్టుకుని అటుగా పోయినాడు అంట, వాడికి అక్కడ ఇసుకలో ( పెన్నా నది ఉంది లే ఆ ఊరి పక్కన) ఇటుకలు దొరికినాయ్ అంట, ఊర్లో వాని నేస్తగాల్లకి  చెప్తే, వారు తల ఒక ఇటుక ఇంటికి పట్టుకపోయినారు, అది ఊర్లో వాళ్ళు చూసి అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి చెప్తే, వాళ్ళు ఇక్కడేదో ఉంది అని, ఇసుకని తవ్వితే అందులో ఈ దానవులపాడు గుడి బయట పడింది అంట అంతే కాకుండా ఆ బుద్దుని కింద 50 అడుగుల పాము ఒకటి ఉందని, అందుకే బుద్దుని కాళ్ళు కనపడకుండా మూసేశారని " ఇలా కథలు చెప్పాడు . అప్పుడేదో పిల్లగాళ్ళం అంతే కాకుండా మా ఊర్లో కూడా ఊర్లో గుడి నుంచి ఊరి బయట శివాలయం వరకు పెద్ద పాము ఉందని, ఒక్కడు ఎవరైనా అటువైపు వెళ్తే ఎత్తకపోతాది అని ఒక కథ ఉండేది . ఈ దానవులపాడు కథ కూడా ఒకే విధంగా ఉండేసరికి ఎప్పుడో ఒకసారి ఎవడో ఒకడు తోడు దొరికితే పోదాం అని వాయిదా వేశాం

ప్రసాద్ గాడు ఫోన్ చేసినపుడు ఈ జరిగిన కథ గుర్తొచ్చి "పోదాం రా, శాన్నల్ళ నుండి పోదాం అనుకుంటున్నా, టైం డేట్ చెప్పు, ఇంటి దగ్గర ఏం చేయడం లేదు, ఒక ట్రిప్ వేద్దాం అన్నాను" , వాడు 2 రోజుల తర్వాత అని చెప్పాడు, మనకి ఓకే . బస్సు లో వెళ్తే ఒక 2 కిమీ రోడ్డు నుండి లోపలికి నడవాలి కాబట్టి బండి అయితే మేలు అని రగ్గాడికి ఫోన్ చేశా. 'దానవులపాడు కి పొవాలి  అని రా, నీ బండి ఎవరు వాడరు కదా, ఒక రోజు తీసుకుంటా' అన్నాను. వాడు "సరే" అన్నాడు . ఇంకేం అన్ని సిద్ధం . కెమెరా కి చార్జింగ్ చేసి రెడీగా ఉంచుకున్నాను .

ఈ దానవులపాడు మా ఊరికి 20 కిమీ దూరంలో ఉంది. 2 రోజుల తర్వాత పొద్దున్నే 8గంటలకే స్టార్ట్ అయ్యాం . మనోడు గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతున్నాడు అంట సో దానవులపాడు చరిత్ర చెప్తూ ఉన్నాడు బండి వెనుక కూర్చుని, నేను బండి నడుపుతూ వింటూ అలా వెళ్తున్నాం . ఫస్ట్ టైం బండి నడపటం, అది కూడా డిస్కవర్ 125. ముందే చెప్పా ప్రసాద్ గాడికి "బాబు, మనకి బండి అంతంత మాత్రం, సో భరించాలి' అని. వాడు ఏం అనలేదు, "ట్రై చేద్దాం పద" అన్నాడు. దారిలో చాల విషయాలు మాట్లాడాం . చాల చెప్పాడు, వాడి ప్రిపరేషన్ గురించి

దానవులపాడు నిజంగా అయితే జైన తీర్థం, చుట్టుపక్కల వాళ్ళకి మాత్రం అది బుద్దుడి గుడి . వెళ్ళేదారిలో రోడ్ కొత్తగా వేస్తున్నారు . సో దారి తప్పిపోయాం . అప్పుడు రోడ్ పైన ఒక మనిషిని "ఇక్కడ జైన గుడి కి దారెటు" అంటే "అదెక్కడ, తెలీదు" అన్నాడు . "బుద్దుడి గుడి ఎక్కడ " అని అడిగితే "బుద్దుడి గుడా , ఆడ్నుంచి సందులో పొతే వస్తుంది  " అన్నాడు . మెయిన్ రోడ్ నుండి డైవెర్శన్ 2కిమీ లోపలికి. పక్కా ఊరు రోడ్, కంపలు, అటు ఇటు పొలాలు బాగుంది . మొత్తానికి 10 కి అక్కడికి చేరుకున్నాం . అక్కడ పెద్ద బోర్డు,  గుడి ఆరవ శతాబ్దంది  అని, కన్నడ, సంస్కృత శాసనాలు ఉన్నాయని రాసారు. లోపలికి వెళ్ళడానికి గేటు ఒకటి, దాటుకుని ముందుకి వెళ్తే, చిన్న జైన దేవాలయం . గత 1500 సంవత్సరాలుగా ఇసుకలో పూడుకుపోయి, ఈ మధ్యే త్రవ్వకాలలో బయటపడిన గుడి .

పూర్వం మా ఏరియా లో జైన మతం బాగా వ్యాప్తి లో ఉండేది అనుకుంటాను , చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం దానవులపాడు 'జైన మత కేంద్రం'. ఆ కాలంలో ఇక్కడి నుండే జైన మాట వ్యాప్తి చేసారు అంట . కేంద్రం అన్నారు కదా, చిన్న గుడే ఉంది అనుకున్నాను. కాని అప్పుడు ప్రసాద్ చెప్పాడు "ఇంకా ఉంది బాబు, ఇలా రా" అని గుడి నుండి పెన్నా నది ఒడ్డుకి పిలుచుకెళ్ళాడు. గుడి అంత గా ఏమిలేదు కాని పెన్నా లో కి స్నానం కోసం ఆ కాలం లో వాళ్ళు కట్టిన మెట్లు, పెన్నా వరదల ( ? ) నుండి కాపాడుకోవడానికి పెద్ద రాతి గోడ, దాని మీద చాల శిల్పాలు, చాల బాగున్నాయి .

ఆ కాలంలో అంత పెద్ద రాళ్ళతో అంత పొడవు గోడ ఎలా కట్టారో కాని, నిజంగా అద్భుతం . ఎందుకంటే దగ్గరలో ఈ రాళ్ళ గనులు లేవు, అది కాకుండా 6 వ శతాబ్దం లో కట్టింది, వింతే అనిపించింది నాకు. ఈ మెట్ల వరుసలో శిల్పాలు చూస్తే , జైనుల కూడా హిందూ మతం దేవుళ్ళు ని పూజించే వారు అని తెలుస్తుంది . వినాయకుడు, బాలకృష్ణుడు, చెట్టుకింద నిల్చున్న గోపికలు, నాగుపాము బొమ్మలు, ఇలా చాల ఉన్నాయి . ఇంకా మన జైనులని శృంగార అభిలాష కూడా ఎక్కువే ఉన్నట్లుంది . గోడ ని బాగా గమనిస్తే, చాల శిల్పాలు, రేఖా చిత్రాలు ఉన్నాయి . అయితే ఇవి గోడ, అదే గుడి కి దూరం గా ఉన్నాయి . కాబట్టి గుడి దగ్గర ప్రశాంతంగా ఉండు సామి, బయట ఏమైనా చేసుకో అని అర్థం అవుతుంది.

గోడ పొడవే ఒక కిలోమీటర్ ఉంటుంది , వెడల్పు ఒక అర కిమీ , దీన్ని బట్టి గుడి మొత్తం వైశాల్యం ఎంత పెద్దదో తెలుస్తుంది . ఈ ఏరియా లో పూర్వం జైనులు సల్లేఖనం పాటించే వారు అంట. అంటే ఉపవాసం చేస్తూ శరీరాన్ని కృశింప చేసుకోవడం . ఈ ప్రదేశం లో మన ఆర్కియాలజీ వాళ్ళకి తువ్వా మట్టి దొరికింది అంట, కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చారు .

ఇక గుడి లో జైన్ విగ్రహం దగ్గరికి వస్తే, 'విగ్రహం దిగంబరం గా ఉంది . తెల్ల రాయి శిల్పం . విగ్రహానికి అటు ఇటు శాసనాలు కలవు . గంగాకుమార్ చెప్పినట్లు పాదాలు భూమిలో కి పెట్టారు. ఆర్కియాలజీ వాళ్ళు కూడా నమ్మేసారమో పాము ఉందని . గుడి ఇటుకలతో కట్టబడినది . ఇటుకలు చాల పెద్దవి. ఆశ్చర్యం ఏమిటి అంటే ఇటుకలు చాలా ఖచ్చితమైన కొలతలతో చాలా బాగా తయారు చేసారు . ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి .

ఈ జైన గుడి పక్కనే అసంపూర్తిగా ఉన్న ఒక నిర్మాణం ఉంది. చూస్తే మన హిందూ గుడి నిర్మాణం లాగ ఉంది . ఎందుకో మరి పూర్తి చేయకుండా వదిలేశారు. అక్కడ గడ్డి కోసుకుంటూ కొందరు మహిళలు ఉన్నారు . మమ్మల్ని చూసి "యా ఊరయ్య మనది " అడిగారు . బహుశా ఇక్కడికి యాత్రికులు ఎవరు రారేమో, అందుకే మమ్మల్ని వింతగా చూస్తున్నారు . ఇక ఇంటికి వెళ్దాం అనుకుని బయలుదేరాం.

ఈ జైన గుడి బయట సీతా రామ లక్ష్మణ విగ్రహాలతో ఉన్న ఇంకో గుడి ఉంది . ఊరిబయట కదా, గుప్త నిధుల త్రవ్వకాలు జరిగాయేమో, గుడి లో విగ్రహాలు చేతులు, మెడలు  విరిగిపోయాయి . రాముడి విగ్రహం చూడటానికి బాగుంది . అక్కడే బోరింగ్ ఒకటి ఉంటే నీళ్ళు తాగి కొద్ది సేపు ఆ రాముడి గుడి లో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకున్నాం . అలా రాముడి గుడిలో ఆ కాలం లో కాలక్షేపానికి బండల పైన చెక్కిన ఆటల గురించి చర్చించుకుంటూ కొద్దిసేపు అలా  గడిపాము.

నాకింకా అర్థం కాని విషయం ఏంటి అంటే, "ఎందుకు ఈ జైన గుడి ఇసుకలో పూడుకుపోయింది ", నా విశ్లేషణ ఈ విధం గా సాగింది . పెన్నా కి భయంకరమైన వరద వచ్చి ఇసుకతో కప్పేసింది అనుకుంటే తప్పే, నాకు తెలిసి పెన్నాకి అంత పెద్ద వరదలు ఎప్పుడూ రావు, అస్సలు రావు. హిందువులు, ఆ కాలం నాటి పాలకులు, జైన మత వ్యాప్తి ని అడ్డుకునేందుకు ఈ విధంగా చేసారేమో. ఇదే నిజం అయి ఉండొచ్చు. ఎందుకంటే దొమ్మర నంద్యాల ఊర్లో కూడా జైన విగ్రహాలు దొరికాయి . అక్కడ కూడా ఎవరు జైన మతస్తులు ఇప్పుడు లేరు . అసలు ఈ ప్రాంతం లో జైనులే  లేరు ఇప్పుడు . అంత ప్రాచుర్యం లో ఉన్న జైన మతం ఇలా అంతరించి పోవడానికి కారణమేమిటో ?

దానవులపాడు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు రోడ్ లో దేవగుడి గ్రామం దాటిన తర్వాత వస్తుంది . రోడ్ కి పక్కన ఒక బోర్డు ఉంటుంది . అక్కడ నుండి 2కిమీ లోపలికి  నడవాలి/ మీ సొంత వాహనం లో వెళ్ళవచ్చు . ప్రొద్దుటూరు నుండి 15కిమీ ల దూరం లో ఉంది .

మరికొన్ని  చిత్రాలని కింద slideshow లో చూడొచ్చు . 

Monday, December 16, 2013

ఏ సీమల ఏమైతివో ఏకాకిని నా ప్రియా....

ఏ సీమల ఏమైతివో 
ఏకాకిని నా ప్రియా... 
ఏకాకిని నా ప్రియా...
ఏలాగీ వియోగాన వేగేనో నా ప్రియా...
ఏలాగీ మేఘమాసమేగేనో 
ప్రియా.. 
ప్రియా.. ప్రియా..  ప్రియా...
ఘడియ ఘడియ ఒక శిలయై కదలదు సుమ్మీ..
ఎద లోపల నీ రూపము చెదరదు సుమ్మీ..
పడి రావాలంటే వీలు పడదు సుమ్మీ.. 

వీలు పడదు సుమ్మీ.. 

విరాహ బాధ ని ఇంత కన్నా ఎవరు బాగా చెప్పగలరు. 
మేఘసందేశం చిత్రంలోని ఈ పద్యాలను జేసుదాసు గారి గొంతుతో వింటూ ఉంటే ఏదో తెలియని లోకానికి వెళ్ళినట్లు ఉంది . ప్రతి కవిత లో కవి తన భావన ని, బాధని ఎంతో బాగా చెప్పాడు అంతే వీనుల విందుగా జేసుదాసు గారు వినిపించారు . ఇవే కాకుండా కవితలు చాలా ఉన్నాయి ఈ చిత్రము లో. ప్రతి రోజూ ఎన్నిసార్లు వింటున్నానో తెలియకుండా వింటున్నాను ఈ కవితలని . 


ఈ కవితలని యేసుదాసు గారి గళము లో ఈ క్రింది లంకె ద్వారా వినవచ్చు. 



ఉదయగిరి పయిన  
అదిగొ గగనాన 
కదలె దినరాజు తేరు
ఒదిగి చిరుగాలి 
నిదుర తెర జారి 
కదలె గోదారి నీరు
కదలె గోదారి నీరు

ఊపి ఊపి మనసునొక్కొక్క వేదన 
కావ్యమౌను మరియు గానమౌను
నేటి బాధ నన్ను మాటాడగానీని
 ప్రళయమట్లు వచ్చి పడియె పైని

దారులన్నియు మూసె 
దశ దిశలు ముంచెత్తే 
నీ రంధ్ర భయధాంథకార జీమూతాళి
ప్రేయసీ
ప్రేయసీ
వెడలిపోయితివేల 
ఆ అగమ్య తమస్వినీ గర్భకుహరాల
తమస్వినీ గర్భకుహరాల

లోకమంతా పాకినవి పగటి వెలుగులు
నాకు మాత్రం రాకాసి చీకట్ల మూలుగులు
రాకాసి చీకట్ల మూలుగులు


ఎపుడు నీ పిలుపు వినబడదో 
అపుడు నా అడుగు పడదు 
ఎచటికో పైనమెరుగక 
ఎందుకో వైనమందక 
నా అడుగు పడదు

అది 
ఒకానొక మలు సందె 
ఎదుట
గౌతమీ నది 
ఇరు దరులొరసి 
మింటి చాయలను 
నెమరు వేసుకొనుచు 
సాగినది
అపుడు
అపుడే
కలిగె నాకొక్క దివ్యానుభూతి
కలిగె నాకొక్క దివ్యానుభూతి

శూన్యాకాశము వలె 
చైతన్యలవము లేని 
బ్రతుకు దారుల 
శోభానన్యంబు 
ఒక శంపాలత 
కన్యక 
తొలివలపు వోలె
కాంతులు నించెన్

అంతరాంతరమున
వింత కాంతి నిండి
ఊహలకు రెక్కలొచ్చి
ప్రత్యూష పవన లాలనమునకు విచ్చు సుమాల వోలె.. 
అలతి కవితలు వెలువడే
అంతలోన.....
కనుమొరగిచనెమెరపు 
చీకటులు మిగిలె
అపుడు ఎలుగెత్తి పిలిచినాను
అపుడు దారి తెలియక వెలుగు కొరకు రోదించినాను
రోదించినాను
వెదకి వెదకి వేసారితి 
వెర్రినైతి


ఆశలు రాలి 
ధూళి పడినప్పుడు
గుండెలు చీల్చు వేదనావేశము 
వ్రేల్చినప్పుడు
వివేకము గోల్పడి సల్పినట్టి 
ఆక్రోశము 
రక్తబిందువులలో 
రచియించితి నేను
మేఘసందేశము 
రూపు దాల్చెనది నేడు.
ఇది ఏమి మహా కవిత్వమో!

శోకమొకటియె కాదు 
సుశ్లోకమైన కావ్యమునకు జీవము పోయ
కరుణ ఒకటియే కాదు రసము 
జీవితమున
కవికి వలయు 
ఎన్నో వివిధానుభూతులు 
ఎడద నిండా

నా అన్వేషణ ఎన్నడేన్ సఫలమై
నా మన్కియే 

పూవులున్ 
కాయల్ 
పండ్లును 
నిండు నందనముగా నైనన్
వ్యథావేదనల్ మాయంబై 

సుఖశాంత జీవనము 
సంప్రాప్తించి పూర్ణుండనై
వ్రాయంజాలుదు మానవానుభవదీవ్యత్కావ్య 

సందోహమున్ !!

అంతే  కాకుండా ఈ సినిమా లోని ప్రతి పాట ఒక అద్భుతం అజరామరం . కృష్ణ శాస్త్రి గారి భావ కవిత్వము అమోఘం . 

Wednesday, November 6, 2013

మళ్ళీశ్వరి యక్షగానం పాట

మళ్లీశ్వరి  సినిమా లో వినిపించే ఈ యక్షగానం పాట లోని రాయల వారి వర్ణన ఎన్నితూర్లు విన్నా కూడా వినాలి అనిపిస్తూ ఉంటుంది . చాలా కాలంగా ఈ పాట  లిరిక్స్ ఎక్కడైనా  దొరుకుతాయని అనుకుంటూ ఇవ్వాళ నేనే వింటూ రాసుకుని ఇక్కడ భద్రపరుస్తున్నాను . పాట  ఈ విధంగా సాగుతుంది .

శ్రీ సతితో సరసిజ నయను వలె 
చెలువున దేవేరితో కొలువున 
చెలువున దేవేరితో వెలయగ 
చెలువున దేవేరితో ॥ 

రాజాధిరాజ వీరప్రతాప శ్రీ కృష్ణ రాయ భూపా 
సకలాంధ్ర నిఖిల కర్నాట విపుల సామ్రాజ్య రత్నదీపా 
సామంత మకుట మాణిక్య కిరణ సందీప్త భవ్య చరణా 
సాహిత్య నృత్య సంగీత శిల్ప సల్లాప సరస భవనా !!

కళలకు నెలవగు మా దేవి 
సెలవైన పూని తలపైన 
కరుణింపగ , తిలకింపగ ,
కడుయింపుగ, నటియింపగ 
కవి పండిత శ్రిత కల్పభూజ నవభోజా 

సరస మధుర  ఉషా పరిణయమును 
దేవర సన్నిధి కారుణ్యసేవధి 
చెలువున దేవేరితో కొలువున 
చెలువున దేవేరితో వెలయగ 
చెలువున దేవేరితో ॥ 

అద్భుతమైన వర్ణన !!