Sunday, July 26, 2015

నందికంది, ఝరాసంగం, గొట్టంగుట్ట యాత్ర

నిన్న సంవత్సరం కార్తీక మాసం చివరి రోజు శనివారం పడ్డప్పుడు వెళ్ళినప్పటి యాత్రా విశేషాలివి. ఇన్నాళ్ళు సమయం దొరక్క రాయలేకపొయాను. ఇన్నాళ్ళకి తీరిక దొరికింది. తెలుగు లో ఈ విధంగా కథ లాగా రాస్తూ ఉంటే సమయం బాగా అయిపోతుంది. అందుకే ఇన్ని రోజులు ప్రయత్నాలు విరమించుకుంటూ వస్తూ ఇప్పుడు రాద్దాం అని కూర్చున్నాను .

రాజు, గిరి, నవీన్, నేను అప్పుడు మా గది లో ఉన్నవాళ్ళం. రాజు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు . నవీన్ దుబాయ్ కి వెళ్లి అక్కడ వాతావరణం సరిపోక తిరిగి మనదేశానికి వచ్చాడు. గిరి, నేను ఇక ఈ గది లోనే గత 4 సంవత్సరాలుగా ఉంటున్నాము. చిన్నోడు ఇచ్చిన splendor బండి ఉంది, రామిరెడ్డి ని అడిగి shine బండి తీసుకున్నాం. చాలా రోజులు అయింది కదా, ఒక దూర ప్రయాణం చేద్దాం అని అనుకుని, గొట్టం గుట్ట అనే ప్రదేశం ఖాయం చేసాం . మేము ఉన్న లింగంపల్లి కి 80kms దూరం లో ప్రకృతి రమనీయ ప్రదేశం లో ఉన్న ప్రాంతం అది. సరళా నది పై చంద్రంపల్లి జలాశయం నిర్మించడంతో ఏర్పడిన వెనుక జలాలు "S" ఆకారంలో తిరిగి ఉంటూ, ఆ కొండలు, ప్రకృతి చూడాల్సిందే అని నిశ్చయించుకున్నాం. ఫొటోస్ లో చూడడానికి కింద విధంగా ఉంటుంది.

ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈ నలుగురిలో నాకు తప్ప మిగిలిన వాళ్ళకి ఎలా వెళ్ళాలో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నామో మాత్రం తెలుసు. వెళ్ళాల్సిన దారి మొత్తం gogle maps గుర్తు పెట్టుకుంది నేను ఒక్కడినే. కాబట్టి ఎలాగూ జహీరాబాద్ వరకు వెళ్తున్నాం కదా, దారిలో నందికంది శివాలయం, ఝారసంగం గుడి చూసొద్దాం లే అని అనుకున్నాను. ఇవన్నీ  గొట్టం గుట్ట కి వెళ్ళేదారిలో ఒక 5-10 kms దూరం రోడ్ కి అటు ఇటు ఉంటాయి.

పొద్దున్న 4 కి నిద్ర లేద్దాం అనుకున్నాం, నేను 4 కి లేచా, కాని అందరు లేచి సిద్దం అయేసరికి 7 అయింది. 5 కి ఎలాగైనా ప్రయాణం మొదలవ్వాలి అనుకుంటే ఇక్కడే 7 అయింది. సరేలే కొంచెం వేగంగా వెళ్ళొచ్చు అనుకుని మొదలుపెట్టాం. మా బండ్ల గురించి చెప్పా కదా, ఒకటి Splendor, ఇంకోటి Shine. కాబట్టి బండి ఇంజిన్ చల్లబడడానికి ప్రతి 20kms లేదా 40 నిమిషాలకి ఒక సారి ఆగుదాం అనుకున్నాం. మొదట కంది ఊర్లో ఆగాం, 7:50 అయింది. అక్కడ రోడ్ పక్క టీ అంగడి లో టీ తాగి, పేపర్ చదివి, ఒక్కొక్కడికి పొద్దున్నే చలికి కడుపు పట్టుకుంటే అలా రోడ్ పక్కకెళ్ళి కడుపు ఖాళీ  చేసి బయలుదేరాం. తర్వాత నందికంది, వీళ్ళకి తెలీదు కదా ఇది నా plan  లో ఉందని. అందుకే టీ తాగేటపుడు ఆరోజు వెళ్ళవలసిన ప్రదేశాలు, వాటికి దారి అన్నీ విశదీకరించి చెప్పాను. ఈ నందికంది, కంది కి 10kms దూరం. 11వ శతాబ్దం లో, కళ్యాణి చాళుక్యులు నిర్మించిన ఒక శివాలయం. నక్షత్రాకారపు పునాది మీద, పూర్తిగా రాతి నిర్మాణం. స్తంభాల మీద అద్భుత శిల్పాలు, గుడి బయట వీరగల్లులు చాలా ఉన్నాయి. గుడి పై ఫోటో లో లాగ ఉంటుంది. ఇక్కడ నంది ప్రత్యేక ఆకర్షణ.

ద్వార తోరణం కి 6 రంధ్రాలు ఉంటాయి. ఊరి వాళ్ళని అడిగితే, ప్రతి రుతువుకు ఒక్కో రంద్రం గుండా సూర్య కాంతి శివాలయం మీద పడుతుంది అని చెప్పారు, ఎందుకో నమ్మాలనిపించలేదు. సూర్యకాంతి రంధ్రంలో నుండి పడ్డా కానీ, బయట గుడి వెలుతురు వలన ఎలా తెలుస్తుంది. బాబు ఇవన్నీ ఆలోచిస్తే మనకి సమయం వృధా అవుతుందని అక్కడినుండి బయలుదేరాము. సదాశివపేట టౌన్ లో ఆగాము 9 కి, కారం దోశ, ఇడ్లి తిని, మళ్లీ ప్రయాణం మొదలుపెట్టాం, ఈసారి ఝారాసంగం. సదాశివపేట లో ఇడ్లి బండి అతను, అక్కడికి దగ్గరే, జహీరాబాద్ వెళ్ళాసిన అవసరం లేకుండా, ఏదో ఊరి పేరు చెప్పి, అక్కడినుండి వెళ్ళమని చెప్పాడు.

దారి మొత్తం, శీతాకాలపు ఎండిపోయిన గడ్డి పొద్దున్న సూర్యకిరణాలకి బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటే, ఆగుతూ ఫోటోలు తీసుకుంటూ చాలా  సరదాగా సాగింది యాత్రలో ఈ భాగం. పల్లెటూరి రహదారులు, దారికి అటు ఇటు పొలాలు, పూల తోటలు అద్భుతం. ఇన్నాళ్ళ నగర వాతావరణానికి అలవాటు అయిన మాకు కాస్త విశ్రాంతి ఈ  పల్లె వాతావరణం కలిగించింది ఎండ కూడా పొద్దున్న 10 కి అంతగా అనిపించలేదు. ఇప్పుడే ఇలా ఉంటే, వర్షాకాలం లో ఇంకా బాగుండేది ఏమో .

ఆ విధంగా పల్లెలు, పొలాలు దాటుకుంటూ ఝారాసంగం చేరేసరికి 11:30 అయింది. కార్తీక మాసం చివరి రోజు కదా, జనాలు చాలా మంది ఉన్నారు గుడిలో. దర్శనం కి వెళ్తే ఇంటికి వెళ్ళలేము అనుకుని, గుడి బయటే టెంకాయ కొట్టి ఒక అరగంట కూర్చున్నాం గుడి ఆవరణలో. కొద్దిసేపు ప్రయాణ బడలిక పోయాక బయల్దేరుదాం అనుకున్నాం. ఝారాసంగం లో ఒక చిన్న కోనేరు గుడి వెనుక ఉంటుంది, ఆనుకుని. అందులో ఎప్పుడు నీరు  ప్రవహిస్తూ ఉంటుంది అంట. మేము వెళ్ళినపుడు జనాలు ఆ నీటిని రోత చేసేసారు. మాములు రోజుల్లో చాలా స్వచ్చంగా ఉంటుందని అన్నారు, ఎప్పుడైనా మళ్లీ వెళ్ళాలి.  గుడిలో ప్రసాదం, పులిహోర తీసుకుని దారిలో తిందాం అని అక్కడి నుండి 12:30 కి బయలుదేరాము. దారిలో చెరకు తోట పక్కన, వేప చెట్టు కనపడితే, దాని కింద కూర్చుని, లడ్డు, పులిహోర లాగించి, ఎండా మరీ ఎక్కువగా ఉంటే ఒక 15 mins  అక్కడే కూర్చుని, జహీరాబాద్ కి బయలుదేరాము.

జహీరబాద్ కి 2 కి చేరుకున్నాం. గొట్టం గుట్ట ఇక్కడికి 20kms  దూరం. లడ్డు, పులిహోర లతో ఆకలి తీరక పోయేసరికి, జహీరాబాద్ లో biscuits, పకోడీలు, వాటర్ bottles  తీసుకుని, గొట్టంగుట్ట కి బయలుదేరాము. గొట్టంగుట్ట కి వెళ్ళేదారిలో చాలా తాండాలు ఉన్నాయి, అక్కడికి బస్సులు, రవాణా వంటివి చాలా తక్కువ అనుకుంటాను, దారి  లో ఒక 2 గంటల ప్రయాణం లో ఏదో 10 మంది కంటే ఎక్కువ మంది కనిపించలేదు, పొలం పనులకి వెళ్ళారేమో ఏమో తెలీదు, ఇదే హైదరాబాద్ లో అయితే, రోడ్ మీద మనుషుల కంటే వాహనాలు ఎక్కువ కనపడుతాయి. ఆ విధంగా అక్కడి ప్రజలు ప్రశాంతంగా, కాలుష్యం లేని వాతావరణం లో జీవిస్తున్నారు. ప్రజలు చాలా వరకు నడిచే వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళాలన్న కానీ. వెళ్ళడానికి మట్టి, రాళ్ళ రోడ్ మీద ప్రయాణం . దారికి అటు ఇటు అటవీ శాఖ వారు వేసిన eucalyptus చెట్లు దారికి మరింత అందాన్ని ఇచ్చాయి. ఇక్కడ భూమి, మట్టితో కూడిన రాయి అంటే వికీపీడియా ప్రకారం బిళ్ళరాయి .

ఇక్కడి ప్రజలు ఈ రాతినే ఇటుకల లాగ కత్తిరించి ఇల్లు, ఇతర నిర్మాణాలకి వాడుకుంటున్నారు. ఇలాంటి రాతి నిర్మాణాలు నేను బీదర్ లో కూడా చూసా. భూమి ఈ విధంగా రాతిమయం అయినందున ఇక్కడ అంతగా వ్యవసాయం చేస్తున్నట్లు అనిపించలేదు, ఆ eucalyptus చెట్లు తప్పితే. ఈ తండా పేరు చున్నంబట్టి తండ. ఈ పల్లె దాటుకుని ఒక 4 kms వరకు ఈ eucalyptus plantation ఉంటుంది .

తర్వాత చిన్న అడవి మొదలవుతుంది. ఇది చించోలి అభయారణ్య ప్రాంతం లోకి వస్తుంది. ఈ అడవి దారి మధ్యలో చిన్న చిన్న గుళ్ళు, శివాలయం, విఘ్నేశ్వరాలయము, భవాని గుడి లు ఉంటాయి. వీటి అన్నింటిని దాటుకుని వెళ్తే చివరగా వంపులు తిరుగుతూ జలాశయం లో కలిసే సరళా నది కొండ కింద కనపడుతుంది, ఆ దృశ్యం అద్భుతం.

మేము వెళ్లేసరికి 3:30 అయి ఉండొచ్చు, ఎండ సెగలు కక్కుతోంది, దానికి తోడు ఈ జలాశయం లో నీళ్ళు. కిందకి దిగొచ్చు అంటే, గబ గబా దిగేసాము. కింద ఇంకా అద్భుతం. ఆ అడవి, పచ్చదనము, నది. ఒక్కోటి అద్భుతం. అలా ఇలా తిరుగుతూ, కొద్ది సేపు ఫోటోలు దిగుతూ, ఒక చెట్టు చూసుకుని, దాని కింద కూర్చున్నాం, పకోడీలు ఆరగించడానికి. నిదానంగా తిని, బయల్దేరుదాం అనుకున్నాం. కొన్ని ఫొటోస్ తీసుకుని బయలుదేరాం.

కిందకి దిగేతపుడు ఎంత సులభం అనిపించిందో, ఎక్కేతపుడు మాత్రం సినిమా చూపించింది. ఒక్కొక్కడికి పైకి ఎక్కేసరికి చొక్కాలు తడిసిపోయాయి. ఎక్కిన తర్వాత, అక్కడ బక్క మహాప్రభు గుడి ఉంటే, కాసేపు కుర్చుని, సేద తీర్చుకుని బయలుదేరాము. అక్కడ గుడిలో ఉన్న వాళ్ళని ఇంకేమైనా చూడటానికి ఉన్నాయా అని అడిగితే, ఎత్తిపోతల జలపాతం దగ్గరలో ఉందని అన్నారు. ఎత్తిపోతల అంటే నాగార్జునసాగర్ దగ్గర కూడా ఉండేది అంటే, ఏమో తెలీదు, మేము దీన్ని ఎత్తిపోతల అనే పిలుస్తాము అన్నారు. జలపాతం లో నీరు ఉందా అంటే, ఉంది అన్నారు. తర్వాతి ప్రదేశం, ఎత్తిపోతల జలపాతం చూసొద్దాం అని బయల్దేరాం.

దారి పొడవునా రోడ్ కి అటు ఇటు ఎండిపోయిన గడ్డి, పూల తోటలు, ఈ దారి పొద్దున్న చూసిన దారి కంటే ఇంకా బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అదృష్టవంతులు, లేకుంటే ఇన్ని అందాలు రోజు చూస్తె భాగ్యం వాళ్ళకి ఉంది. ఈ దారిలో కొన్ని ఫొటోస్ తీసుకుని, బయలుదేరాం. రవాణా కష్టం కాబట్టి, రోడ్ ల మీద కనుచూపుమేరలో ఒక మనిషి కూడా కనపడడం లేదు. అంతా గాలి కి గడ్డి చేసే సౌండ్ మాత్రమే, నిశ్శబ్దం అసలు. రణగొణ ధ్వనుల నుండి ఉపశమనం.

ఆ విధంగా ఆ పల్లెలు, చిన్న చిన్న కొండలు దాటుకుంటూ వెళ్ళాము. మధ్యలో ఒక ఊరి దగ్గరకి వచ్చేసరికి గమనిస్తే, మేము కర్నాటక రాష్ట్రంలో ఉన్నాము. అలా ఊర్ల నుండి వెళ్తూ, దూరం లో కొండలు నీలిరంగులో, రోడ్ కి అటు ఇటు పొలాలు, ప్రకృతి చూస్తూ, అలా వెళ్ళాక, కొద్దిసేపటికి జలపాతం దగ్గరికి చేరుకున్నాం. జలపాతం చాల చిన్నది, మహా అయితే 25 అడుగుల ఎత్తు ఉంటుంది. మేము వెళ్లేసరికి హొతి గ్రామ స్కూల్ పిల్లలు పిక్నిక్ కి వచ్చి ఆడుకుంటూ ఉన్నారు. మేము కూడా జలపాతం దగ్గర కాసేపు కొండలు ఎక్కి, దిగి, ఫొటోస్ తీసుకుని సరదాగా గడిపి బయలుదేరాం. అప్పటికే 5:30 అయింది. చీకటి పడే సమయం అవుతోంది, కాబట్టి బయలుదేరాం. జహీరాబాద్ కి 6:30 కి చేరుకున్నాం. పెట్రోల్ పట్టించుకుని, రాత్రి ఇంటికి వచేసరికి 10 అయింది, బయటే తిని, వచ్చి పడుకున్నాం. మొత్తానికి ఒక విజయవంతమైన యాత్ర, సరదాగా, అంతకి ముందు జనాలకి అంతగా తెలియని అధ్బుత ప్రకృతి రమణీయ ప్రదేశాలు చూసి వచ్చాం.  మరిన్ని ఫొటోస్ కింద picasa slideshow చూడొచ్చు

No comments:

Post a Comment